![]() |
![]() |

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో ఆకట్టుకున్న హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు మంచి చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో వీరు హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారు.
ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమని మూవీ టీమ్ చెబుతోంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రేమ ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, 'ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి'కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |