![]() |
![]() |

కన్నడ చిత్రం 'కాంతార' దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కర్ణాటకలో ఇప్పటికే 'కేజీఎఫ్' కంటే ఎక్కువ మంది వీక్షించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ కాంతార.. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఇందులోని 'వరాహ రూపం' పాటని కాపీ చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
'కాంతార' చిత్రం ఎంతలా ఆదరణ పొందిందో అందులోని 'వరాహ రూపం' పాట అంతకుమించి ఆదరణ పొందింది. అయితే ఈ చిత్రం కర్ణాటకలో విడుదలై మూడు వారాలు దాటిపోగా, ఇప్పుడు ఈ చిత్రంలోని పాటపై కాపీ ఆరోపణలు రావడం ఆసక్తికరంగా మారింది. కేరళకు చెందిన 'థాయికుడమ్ బ్రిడ్జ్' అనే సంగీత బృందం ఈ కాపీ ఆరోపణలు చేసింది. 'కాంతార'లోని 'వరాహ రూపం' పాట తాము రూపొందించిన 'నవరసం' పాటలానే ఉందని తెలిపింది. తమ అనుమతి లేకుండా అలా పాటని కంపోజ్ చేయడం కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, దీనిపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఎందరో ప్రశంసలు అందుకున్న 'కాంతార' చిత్రం ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
![]() |
![]() |