![]() |
![]() |

భారీ అంచనాలతో విడుదలైన 'లైగర్' మూవీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఎక్కువ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో.. కొంతమేర డబ్బులు తిరిగిస్తామని దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ ప్రకటించారు. అయినప్పటికీ కొంతమంది ఎగ్జిబిటర్స్ ఈ నెల 27న పూరి ఇంటిని ముట్టడించాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ విషయం పూరి చెవిన పడటంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంపై ఆయన స్పందించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.. అయినా పాపం వాళ్ళు నష్టపోయారని ఇస్తున్నాను. బయ్యర్లతో మాట్లాడి ఒక నెలలో ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తే, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఇలా కొందరు ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. మేం పరువు కోసం డబ్బులు ఇస్తున్నాం.. అలాంటిది నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. 'పోకిరి' దగ్గర నుంచి 'ఇస్మార్ట్ శంకర్' దాకా ఎన్నో సినిమాలకు బయ్యర్ల దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరైనా వసూలు చేసి పెడతారా? లేదు కదా?. ఇక్కడ అందరూ గొప్పోళ్ళే, అందరూ డబ్బున్నోళ్లే, అందరూ చేసేది వ్యాపారమే. ధర్నా చేస్తా అంటున్నారుగా చేయనీ.. ఆ ధర్నాలో పాల్గొన్న వారికి తప్ప మిగతా వాళ్లకి డబ్బులు తిరిగి ఇస్తాను" అంటూ పూరి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. మరి పూరి ఆడియో క్లిప్ దెబ్బతో ఆ ఎగ్జిబిటర్లు ధర్నా ఆలోచనని పక్కన పెడతారేమో చూడాలి.
![]() |
![]() |