![]() |
![]() |

ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే థియేటర్ల దగ్గర తెగ సందడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరో ఎవరనేది కాకుండా థియేటర్ కి రప్పించే అంత కంటెంట్ సినిమాలో ఉంటేనో లేదా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకుంటేనో మాత్రమే సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ కి కదులుతున్నారు. అందుకే పెద్ద హీరోల సినిమాలకు సైతం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావట్లేదు. తాజాగా విడుదలైన కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సినిమా 'ది ఘోస్ట్' పరిస్థితి కూడా అలాగే ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ది ఘోస్ట్' మొదటి రోజు నైజాంలో రూ.57 లక్షల షేర్, సీడెడ్ లో రూ.24 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.19 కోట్ల షేర్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.2 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.20 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.25 లక్షల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 2.45 కోట్ల షేర్(4.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.21.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అద్భుతం జరగాలి.
నాగార్జున చేసే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదని అర్థమవుతుంది. ఆయన గతేడాది చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'వైల్డ్ డాగ్'కి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.2 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇప్పుడు చేసిన మరో యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'కి సైతం అదేస్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. మరోవైపు కుమారుడు నాగ చైతన్యతో కలిసి నాగార్జున చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బంగార్రాజు' మాత్రం ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలై మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. దీనిని దృష్టిలో ఉంచుకొని నాగార్జున సినిమాల ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |