![]() |
![]() |

'థాంక్యూ'తో పరాజయం ఎదుర్కొన్న అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చైతన్య.. తన తదుపరి చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది.
'నీదీ నాదీ ఒకే కథ'(2018)తో దర్శకుడిగా పరిచయమైన వేణు మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా 'విరాట పర్వం' ఈ ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆయన మూడో సినిమాను చైతన్యతో చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే స్టోరీ విన్న చైతన్య ఇంప్రెస్ అయ్యాడని, ప్రస్తుతం వేణు స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
మొదటి సినిమా 'నీదీ నాదీ ఒకే కథ'లో చదువు, ఉద్యోగం పేరుతో యువతను ఒత్తిడికి గురి చేస్తున్న సమాజాన్ని ప్రశ్నించిన వేణు.. రెండో సినిమా 'విరాట పర్వం'లో నక్సలిజం నేపధ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమ కథని చూపించాడు. మరి ఇప్పుడు చైతన్య కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడో చూడాలి.
![]() |
![]() |