![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలే ఉండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్ తో ప్రమోషన్స్ గ్యాప్ లేకుండా జోరుగా సాగనున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ లో మెగాస్టార్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. తాజాగా ఆయన 'గాడ్ ఫాదర్' పోస్టర్ తో కూడిన ఒక ఆడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో "నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అంటూ చిరంజీవి వాయిస్ తో డైలాగ్ ఉంది. దీంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి దానిని 2011లో కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి 'ఖైదీ నెం.150'(2017)తో మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ తాజాగా షేర్ చేసిన డైలాగ్ తో ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు.
అయితే ఆ డైలాగ్ పాలిటిక్స్ కి సంబంధించినది కాదని, అది కేవలం గాడ్ ఫాదర్ చిత్రంలోని డైలాగ్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి, ఆ తర్వాత కొన్ని రాజకీయ లెక్కలు సరి చేయడానికి రంగంలోకి దిగుతారు. ఆ పాత్ర స్వభావాన్ని తెలిపేలా ఈ డైలాగ్ సాగుతుంది. అయితే అందరూ ఈ డైలాగ్ ని చిరంజీవి నిజ రాజకీయ జీవితానికి ముడిపెడుతున్నారు. ఏదైతేనేం ఈ డైలాగ్ పుణ్యమా అని బోలెడంత పబ్లిసిటీ వస్తోంది.
![]() |
![]() |