![]() |
![]() |

చిరంజీవికి మెగాస్టార్‌గా ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో మనకు తెలుసు. ఒకానొకప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అమితాబ్ బచ్చన్ సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న కాలంలో ఆయన రెమ్యూనరేషన్ రూ. 1 కోటికి చేరుకున్నప్పుడు, చిరంజీవి రూ. 1.25 కోట్లు తీసుకుంటున్న హీరోగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆయనపై జాతీయ స్థాయి పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే.. 'ఖైదీ నంబర్ 150' మూవీతో చిరు సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆ తర్వాత 'సైరా.. నరసింహారెడ్డి'గా ప్రేక్షకుల్ని అలరించారు. కాకపోతే 'ఆచార్య' దగ్గరకు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులైపోయాయి. చిరు కెరీర్‌లోనే కాకుండా ఇండస్ట్రీ వరస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా అది నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన బయ్యర్లు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
కాగా 'ఆచార్య' మూవీ నుంచి రానున్న మూడు సినిమాల్లో కూడా ఎవరో ఒక స్టార్ హీరో భాగం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'ఆచార్య' మూవీలో సిద్ధగా రామ్‌చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. మోహన్‌రాజా డైరెక్షన్‌లో మెగాస్టార్ నటిస్తోన్న 'గాడ్‌ఫాదర్' మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్‌లో కనువిందు చేయనున్నాడు. ఇది మలయాళం బ్లాక్‌బ్లస్టర్ 'లూసిఫర్'కు రీమేక్.
డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) రూపొందిస్తోన్న 'మెగా 154'లో మాస్ మహారాజా రవితేజ ఓ ప్రత్యేక పాత్రను చేయడానికి అంగీకరించడం, ఇటీవలే ఆయన సెట్స్ మీదకు వచ్చిన విషయం మనకు తెలుసు.
కాగా, ఇప్పుడు మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తోన్న 'భోళా శంకర్' మూవీలోనూ ఓ స్టార్ హీరో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో చిరు జోడీగా తమన్నా, చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇప్పుడు కీర్తి జోడీగా నాని లేదా నితిన్‌ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు భోగట్టా. నాని, నితిన్.. ఇద్దరితోనూ గతంలో నాయికగా నటించింది కీర్తి. ఏదేమైనా.. 'ఆచార్య' నుంచి చిరంజీవి ప్రతి సినిమాలోనూ ఓ స్టార్ హీరో ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్‌గా మారిపోయింది.
![]() |
![]() |