![]() |
![]() |

యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్ కి బ్రేక్ పడింది. మొదటి మూడు సినిమాలతో విజయాలను అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి.. తన నాలుగో సినిమా 'ది వారియర్'తో మొదటి ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి.. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో కృతికి అవకాశాలు క్యూ కట్టాయి. 'ఉప్పెన' తర్వాత కృతి నటించిన 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' కూడా హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రీసెంట్ గా విడుదలైన 'ది వారియర్'తో మొదటి పరాజయాన్ని చూసింది కృతి. రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది వారియర్' మంచి అంచనాలతో జులై 14న విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్లు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 55 శాతం లోపే రికవరీ సాధించే ఛాన్స్ ఉంది. అంటే 'ది వారియర్' రూపంలో కృతికి ఫస్ట్ ప్లాప్ వచ్చిందన్నమాట.

నితిన్ సరసన కృతి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' ఆగష్టు 12న విడుదల కానుంది. నాలుగు వారాల వ్యవధిలోనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న కృతి.. మాచర్లతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి. మరోవైపు కృతి ప్రధాన పాత్ర పోషించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వీటితో పాటు 'బంగార్రాజు' తర్వాత నాగ చైతన్య సరసన మరో సినిమాలో నటిస్తోంది. అలాగే సూర్య-బాల కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వనంగాన్'(అచలుడు)తో కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది.
![]() |
![]() |