![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ - స్టార్ డైరెక్టర్ కె.ఎస్.ఆర్. దాస్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో పలు యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో `దొంగల వేట` ఒకటి. అకిరా కురుసోవా జపనీస్ చిత్రం `హై అండ్ లో` (1963) స్ఫూర్తితో రూపొందిన హిందీ చిత్రం `ఇన్ కార్` (1977) ఆధారంగా `దొంగల వేట`ని తీర్చిదిద్దారు దర్శకుడు దాస్. అందాల తార జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, పద్మనాభం, ప్రసాద్ బాబు, పండరీ బాయి, జయమాలిని, జయవిజయ, రాజనాల, మిక్కిలినేని, రావి కొండల రావు, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. జగ్గయ్య, అల్లు రామలింగయ్య అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు సమకూర్చారు.
సత్యం బాణీలకు దాశరథి, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర, గోపీ సాహిత్యమందించారు. ``నా కనులే నీ కనులై``, ``మహిమలు చూపే మాయలమారికి``, ``ముందుంటే కుమ్మింది కోపం`` తదితర గీతాలు రంజింపజేశాయి. త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై పి. బాబ్జీ, జి. సాంబశివరావు నిర్మించిన `దొంగల వేట`.. 1978 జూలై 14న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. కాగా, నేటితో ఈ చిత్రం 44 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |