![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్.. తెలుగులో నేరుగా నటించిన చిత్రాల్లో సింహభాగం క్లాసిక్స్ గా నిలిచాయి. మరీముఖ్యంగా.. కళాతపస్వి కె. విశ్వనాథ్ తో కమల్ జట్టుకట్టిన చిత్రాలైతే అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాగే, అనేక అవార్డులను సొంతం చేసుకున్నాయి. అలాంటి ఈ ఇద్దరి అపూర్వ కలయికలో వచ్చిన తొలి చిత్రమే.. `సాగర సంగమం`. సంగీతభరిత నృత్యప్రధాన చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కళ కోసం ప్రాణం పెట్టే బాలకృష్ణ అలియాస్ బాలుగా కమల్ అద్వితీయ అభినయం.. సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అలాగే, `ఉత్తమ నటుడు` విభాగంలో అటు `ఫిల్మ్ ఫేర్`, ఇటు `నంది` పురస్కారాలను అందించింది.
జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, ఎస్పీ శైలజ (నటిగా ఏకైక చిత్రం), సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, చక్రి తోలేటి, మంజు భార్గవి, గీత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కె. విశ్వనాథ్ రచన చేసిన ఈ చిత్రానికి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. ఇక మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``మౌనమేలనోయి``, ``నాద వినోదము నాట్య విలాసము``, ``తకిట తథిమి``, ``ఓం నమః శివాయ``, ``వేదం అణువణువున``, ``వేవేల గోపెమ్మలా`` అంటూ మొదలయ్యే గీతాలన్ని రంజింపజేశాయి.
ఉత్తమ సంగీత దర్శకుడు (ఇళయరాజా), ఉత్తమ గాయకుడు (బాలు) విభాగాల్లో `జాతీయ` పురస్కారాలను.. తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ గాయని (జానకి), ఉత్తమ కళా దర్శకుడు (తోట తరణి), ఉత్తమ ఎడిటర్ (జీజీ కృష్ణారావు), ఉత్తమ ఆడియోగ్రాఫర్ (ఏఆర్ స్వామి నాథన్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి (జయప్రద), ఉత్తమ దర్శకుడు విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను కైవసం చేసుకున్న `సాగరసంగమం`.. పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడమే కాకుండా CNN-IBN జాబితాలో 100 అత్యుత్తమ భారతీయ చిత్రాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది. అదేవిధంగా `సాలంగ ఒలి`, `సాగరసంగమం` పేర్లతో తమిళ, మలయాళ భాషల్లో అనువాదమైన ఈ చిత్రం ఆయా భాషల్లోనూ మంచి విజయం సాధించింది. రష్యన్ భాషలోనూ అనువాదమై.. చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక - ఇలా దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లోనూ 100 రోజులకి పైగా ప్రదర్శితమైన మొదటి చిత్రంగా రికార్డులకెక్కిన `సాగరసంగమం`.. బెంగళూరులోని పల్లవి థియేటర్ లో ఏకంగా 511 రోజుల పాటు ప్రదర్శితమవ్వడం విశేషం. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన `సాగర సంగమం`.. 1983 జూన్ 3న విడుదలై అఖండ విజయం సాధించింది. కాగా, నేటితో ఈ చిత్రం 39 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |