![]() |
![]() |

థియేటర్స్ లో అధిక టికెట్ ధరలతో ప్రేక్షకుల జేబులు ఖాళీ చేసిన పాన్ ఇండియా సినిమాలు.. ఓటీటీలోనూ సబ్ స్క్రిప్షన్ కి అదనంగా రెంట్ వసూలు చేస్తున్నాయి. మే 20 నుంచి 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అయితే జీ5 లో ఈ సినిమా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ కాకుండా అదనంగా మరో రూ.100 చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు అదే బాటలో 'కేజీఎఫ్-2' కూడా పయనిస్తోంది.
ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో 'కేజీఎఫ్-2' స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అదనంగా మరో రూ.199 చెల్లించాల్సి ఉంది. అధిక టికెట్ ధరలతో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమాలకు ఓటీటీలోనూ అదనంగా చెల్లించాలని చెప్పడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇప్పటికే పెద్ద హీరోలు నటించిన పాన్ ఇండియా కాని సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ సాధారణ ప్రేక్షకులను థియేటర్స్ కి దూరం చేసున్నారు.. ఇప్పుడు ఇలా రెంట్ ల పేరుతో ఓటీటీలకు కూడా దూరం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పెద్ద సినిమాలకు అదనపు ఛార్జ్ లు వసూలు చేయడాన్ని ఓటీటీ సంస్థలు సమర్ధించుకుంటున్నాయి. పాన్ ఇండియా సినిమాల రైట్స్ భారీ ధరలకు దక్కించుకోవడంతో.. థియేటర్స్ లో సినిమా ఆడుతుండగానే ఓటీటీలో రెంట్ కి అందుబాటులో ఉంచుతున్నామని.. కొద్దిరోజుల తర్వాత సబ్ స్క్రైబర్స్ ఉచితంగానే చూడొచ్చని వారు చెబుతున్నారు.
![]() |
![]() |