![]() |
![]() |

``ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు.. కానీ పెళ్ళి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి`` - అనే పాయింట్ తో రూపొందిన కుటుంబ కథా చిత్రం `సంతోషం`. కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతోనే దశరథ్ దర్శకుడిగా తొలి అడుగేశారు. నాగ్ కి జోడీగా గ్రేసీ సింగ్, శ్రియ నటించిన ఈ సినిమాలో ప్రభుదేవా, కె. విశ్వనాథ్, చంద్ర మోహన్, సునీల్, పృథ్వీ, అనితా చౌదరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వర రావు, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, ప్రీతి నిగమ్, సుమిత్ర, సుధ, తనికెళ్ళ భరణి, మెల్కొటే, ఎల్బీ శ్రీరామ్, లహరి, మాస్టర్ అక్షయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా సోఫియా హక్ ఓ ప్రత్యేక గీతంలో తన గ్లామర్ తో కనువిందు చేసింది.
ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, కులశేఖర్, చంద్ర సిద్ధార్ధ, విశ్వ సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``నే తొలిసారిగా``, ``దేవుడే దిగివచ్చినా``, ``నువ్వంటే ఇష్టమని``, ``డిరి డిరి డిరిడీ``, ``ఏమైందో ఏమో నాలో``, ``సో మచ్ టు సే``, ``మెహబూబా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మించిన `సంతోషం`.. `ఉత్తమ తృతీయ చిత్రం`, `ఉత్తమ నటుడు` (నాగార్జున) విభాగాల్లో `నంది` పురస్కారాలను, `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుంది. అలాగే, కన్నడంలో `ఉగాది`, బెంగాలీలో `బంధన్` పేర్లతో రీమేక్ అయింది. కాగా, 2002 మే 9న విడుదలై ఘనవిజయం సాధించిన `సంతోషం`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |