![]() |
![]() |

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'భళా తందనాన'. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రేపు(మే 6న) విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన శ్రీవిష్ణు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
"బాణం తర్వాత 'బసంతి' టైంలోనే చైతన్య, నేను కలిసి సినిమా చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కథ కుదరలేదు. అదే టైములో నాకు వేరే అవకాశాలు రావడంతో వాటితో బిజీ అయ్యాను. చైతన్య కూడా అప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల అవి వర్కౌట్ అవ్వలేదు. నాలుగేళ్ల క్రితమే 'భళా తందనాన' చేయాలని అనుకున్నాం. అప్పటికే నేను కమిట్ అయిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల ఏడాదిన్నర ఆలస్యమైంది. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ముందు వేరే బ్యానర్స్ అనుకున్నాం కానీ లక్కీగా లాక్ డౌన్ తర్వాత వారాహి బ్యానర్ ఎంటర్ అవ్వడం హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య కాలంలో వారాహి నుంచి వచ్చిన బెస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంటుంది. ట్విస్ట్ లు అదిరిపోతాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది." అని శ్రీవిష్ణు అన్నాడు.
"ఈ జెనరేషన్ పిల్లలు తెలుగుకి దూరమవుతున్నారు. అందుకే నా సినిమాలకు తెలుగు టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నాను. టైటిల్స్ వల్ల కొందరైనా వాటి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భళా తందనాన టైటిల్ మన అందరికి బాగా తెలిసిన అన్నమయ్య కీర్తన నుంచి తీసుకున్నాం. ఎక్కువగా భక్తి పాటలు రాసే ఆయన.. అందరూ సమానమే అని తెలుపుతూ ఓ విప్లవ గీతంలా దీనిని రాశారు. అందుకే ఈ సినిమాకి భళా తందనాన టైటిల్ కరెక్ట్ అనిపించి పెట్టాం." అని తెలిపాడు.
ప్రస్తుతం 'అల్లూరి'తో పాటు మూడు సినిమాలు చేస్తున్నానని, ఇవన్నీ విభిన్నంగా ఉంటాయని శ్రీవిష్ణు అన్నాడు. భవిష్యత్ లో ఓటీటీల హవా మరింత ఉంటుందని, అవకాశమొస్తే ఓటీటీలో సిరీస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |