![]() |
![]() |

బుల్లితెరపై టాప్ యాంకర్ గా హవా చూపిస్తున్న సుమ కనకాల.. చాలా కాలం తర్వాత వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ కలివరపు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రేపు(మే 6న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన సుమ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'జయమ్మ పంచాయితీ' స్టోరీ తనను దృష్టిలో పెట్టుకొని రాసింది కాదని.. రమ్యకృష్ణ, అనుష్క వంటి వారితో ఈ సినిమా తీయాలని విజయ్ రాసుకున్నారని సుమ తెలిపారు. ఓ రెండు మూడేళ్లు విజయ్ ఈ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగారని, చివరికి నా దగ్గరకు చేరిందని అన్నారు. మొదట ఈ సినిమా ఒప్పుకోవడానికి కాస్త సందేహించానని, కానీ డైరెక్టర్ విజయ్ మీరు ఈ పాత్ర చేయగలరా? అని అడగటంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశానని సుమ చెప్పారు.
సుమ అనగానే అందరికీ ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది కానీ ఈ సినిమా ఒక విలేజ్ డ్రామా. సినిమాలో హ్యూమర్ కూడా ఉంటుందని కానీ డ్రామానే ఈ సినిమాకి బలం అని తెలిపారు. ఈ మూవీ కోసం శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకున్నానని.. కొన్ని సినిమాల్లోలాగా యాసని ఉన్నదానికంటే ఎక్కువగా చూపించకుండా.. ఉన్నది ఉన్నట్లు చూపించామని చెప్పారు. ఈ సినిమా చూస్తుంటే సుమ గుర్తుకు రాదని, జయమ్మ పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఈ మూవీ కోసం 40 రోజులు షూటింగ్ చేశానని.. ఆ సమయంలో షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్ లు చేసుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చి ఉండేవేమో కానీ ఈ సినిమా చాలా తృప్తిని ఇచ్చిందని అన్నారు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశమని భావిస్తున్నానని అన్నారు. ముందు ముందు ఇలాంటి మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తానని, ప్రస్తుతం ఓ రెండు కథలు చర్చల దశలో ఉన్నాయని సుమ తెలిపారు.
![]() |
![]() |