![]() |
![]() |

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు - స్వరవాణి కీరవాణిది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన చిత్రాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో `అల్లరి ప్రేమికుడు` ఒకటి. వెర్సటైల్ స్టార్ జగపతి బాబు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సౌందర్య, రంభ, కంచన్ కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చింది. బ్రహ్మానందం, రామిరెడ్డి, సత్యనారాయణ, సుధాకర్, శ్రీహరి, ఏవీయస్, ధర్మవరపు సుబ్రమణ్యం, నిర్మలమ్మ, రమణ మూర్తి, బెంగుళూరు పద్మ, నర్సింగ్ యాదవ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, ఎం.ఎం. కీరవాణి సాహిత్యమందించిన ఈ చిత్రంలో ``కు కు కు కొమ్మ రెమ్మ``, ``పుత్తడి బొమ్మకు``, ``నారీజన ప్రియతమా``, ``బంతిలాంటి బత్తాయి``, ``చిలిపి చిలక``, ``నిన్ను చూడగానే`` అంటూ సాగే పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. శ్రీ సత్యదుర్గా ఆర్ట్స్ పతాకంపై సురేశ్, సత్యానంద్ నిర్మించిన `అల్లరి ప్రేమికుడు`.. 1994 మే 5న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 28 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |