![]() |
![]() |

``ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు``, ``ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను``.. వంటి డైలాగ్స్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేసిన చిత్రం `పోకిరి`. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో పండు అలియాస్ కృష్ణ మనోహర్ ఐపీయస్ గా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు మహేశ్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేశ్ బాబుకి జంటగా ఇలియానా నటించగా ప్రకాశ్ రాజ్, నాజర్, అజయ్, బ్రహ్మానందం, సుధ, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, అలీ, వేణుమాధవ్, సత్య ప్రకాశ్, సుబ్బరాజు, సత్యం రాజేశ్, జ్యోతి రాణా, మాస్టర్ భరత్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ముమైత్ ఖాన్ ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `పోకిరి`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``ఇప్పటికింకా నా వయసు``, ``గల గల పారుతున్న గోదారిలా``, ``డోలి డోలి``, ``దేవుడా``, ``జగడమే``, ``చూడొద్దంటున్నా``.. ఇలా ఇందులోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. `బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ ఎడిటర్` (మార్తాండ్ కె. వెంకటేశ్), `బెస్ట్ ఫైట్ మాస్టర్` (విజయన్), `బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్` (పి. రవిశంకర్), బెస్ట్ ఆడియోగ్రాఫర్ (రాధాకృష్ణ) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `బెస్ట్ డైరెక్టర్`, `బెస్ట్ యాక్టర్` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను పొందిన `పోకిరి`.. తమిళంలో `పోక్కిరి`, హిందీలో `వాంటెడ్`, కన్నడంలో `పోర్కి`, బెంగాలిలో `మోనేర్ జల` పేర్లతో రీమేక్ అయింది. ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ పతాకాలపై మంజుల ఘట్టమనేని, పూరీ జగన్నాథ్ నిర్మించిన `పోకిరి`.. 2006 ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |