![]() |
![]() |

కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి మాటల్లో ఆయన సినిమాల గురించో, సన్నిహితుల సినిమాల గురించో ఆసక్తికర విషయాలు లీక్ చేస్తున్నారు. 'ఆచార్య' సినిమా టైటిల్ అనౌన్స్ చేయకముందే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఫ్లోలో టైటిల్ లీక్ చేసేశారు. ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో మెగాస్టార్ మైక్ పట్టిన ప్రతిసారీ ఇదే రిపీట్ అయింది. దీంతో మెగా లీక్స్ పేరుతో వీటిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తుంటాయి. ఇక తాజాగా ఈ మెగా లీక్స్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలోని ఒక పవర్ ఫుల్ డైలాగ్ లీక్ కావడం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆచార్య టీమ్ తో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా హరీష్ తో చిరు 'మొన్నేదో డైలాగ్ చెప్పావు.. అది భలే అనిపించింది' అనగా.. 'అది భవదీయుడు భగత్ సింగ్ లో డైలాగ్ సార్' అని హరీష్ చెప్పాడు. 'అది చెప్పొచ్చా' అని చిరు అనడంతో.. హరీష్ వెంటనే కెమెరాలు ఆపేయండని సరదాగా అన్నాడు. ఆ తర్వాత ఆ డైలాగ్ తాను చెప్తానని మెగాస్టార్ అనడంతో.. హరీష్ ఆ డైలాగ్ చెప్పి వినిపించాడు.
"హీరో నడుస్తుంటే వెనకాల చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు. అది చూసిన విలన్ కంగారుపడిపోయి 'మొన్న వీడు మన ఇంటికొచ్చి పెద్దగా అరిచినప్పుడు అసలేంటి వీడి ధైర్యం అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది.. వీడు నడిస్తే వీడి వెనక లక్షమంది నడుస్తున్నారు.. అదే వీడి ధైర్యం అనుకుంటా' అంటాడు. అప్పుడు పక్కనున్న వ్యక్తి 'లేదు సార్.. ఆ లక్ష మందికే ఆయన ముందు నడుస్తున్నాడన్న ధైర్యం' అని చెప్తాడు" అంటూ హరీష్ డైలాగ్ చెప్పడంతో చిరుతో పాటు పక్కనే ఉన్న చరణ్, కొరటాల కూడా డైలాగ్ చాలా బాగుందని ప్రశంసించారు.
ఇక ఈ డైలాగ్ ని చిరు తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. "ఏంటండీ ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి.. వాడి వెనకాల లక్షలాది మంది వస్తున్నారు అదే వాడి ధైర్యం అనుకుంటా.. కాదు కాదు ఆ లక్షలాది మందికే వాడు ముందు నడుస్తున్నాడన్న ధైర్యం" అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
![]() |
![]() |