![]() |
![]() |

మాస్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను తీరే వేరు. ఫలితాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారాయన. నటసింహం నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన దర్శకుడిగా పేరుపొందిన బోయపాటి.. అదే కుటుంబానికి చెందిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ గతంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఆ సినిమానే.. `దమ్ము`. వీరోచిత పాత్రలో తారక్ అభినయించిన ఈ చిత్రంలో త్రిష, కార్తిక నాయికలుగా నటించగా.. సుమన్, భానుప్రియ, వేణు, నాజర్, బ్రహ్మానందం, అభినయ, హరితేజ, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, అలీ, రాహుల్ దేవ్, సంపత్ రాజ్, తనికెళ్ళ భరణి, చలపతి రావు, ప్రసాద్ బాబు, శుభలేఖ సుధాకర్, ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చంద్రబోస్ కలం నుంచి జాలు వారిన గీతాలకు స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు. ఇందులోని టైటిల్ సాంగ్ తో పాటు ``ఓ లిల్లీ``, ``రాజా వాసి రెడ్డి``, ``రూలర్``, ``వాస్తు బాగుందే`` పాటలు కూడా మాస్ ని ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన `దమ్ము`.. 2012 ఏప్రిల్ 27న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. నేటితో ఈ మాస్ డ్రామా.. పదేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |