![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ గాధ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023 విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి రాజకీయ రంగు పులుముకుంది.
తెలంగాణలో కొంతకాలంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ మాటల యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' సినిమాని రాజకీయాలకు ముడిపెడుతూ తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
బీజేపీ అజెండాలో భాగంగానే ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతోందంటూ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశం మొత్తం బీజేపీ భావజాలం వ్యాప్తి చేసేందుకు 15-16 సినిమాలను తెరకెక్కిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలనుకుంటున్న ప్రధాన రాష్ట్రాలకు చెందిన నటులు ఈ సినిమాల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 'ఉరి: ది సర్జికల్ స్టైక్', 'ది కశ్మీర్ ఫైల్స్' లాంటి సినిమాలు విడుదలయ్యాయనీ.. ఇప్పుడు 'ఆదిపురుష్' రెడీ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఆదిపురుష్ ద్వారా మరోసారి శ్రీరాముడి సెంటిమెంట్ ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వం అనే భావన కల్పించే ప్రయత్నంలో భాగమే ఇదంతా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సినిమాలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ సపోర్టర్స్ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలు నిజమేనని.. ఉరి, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను బీజేపీ ప్రమోట్ చేసిన తీరే అందుకు నిదర్శనం అంటున్నారు. అంతేకాదు, ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీ నాయకుడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
![]() |
![]() |