![]() |
![]() |

తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పెద్ద సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. 'ఆర్ఆర్ఆర్'కి పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ఇటీవల డబ్బింగ్ సినిమా 'కేజీఎఫ్-2'కి కూడా నాలుగు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక తాజాగా 'ఆచార్య'కు కూడా వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ తో మొదటి వారం ఈ సినిమా టికెట్ ధరలను థియేటర్ ని బట్టి రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాన్-ఏసీ థియేటర్లకు ఈ పెంపు వర్తించదు. అలాగే మొదటి ఏడు రోజులకు ఐదో షో పర్మిషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 7 గంటల నుంచి అర్థరాత్రి 1 లోపు ఐదు షో వేసుకోవచ్చు. ఈ అనుమతులు మే 5 వరకు ఉండనున్నాయి. మే 6 నుంచి సాధారణ ధరలు అందుబాటులోకి వస్తాయి.

అయితే ప్రతి సినిమాకీ టికెట్ ధరలు పెంచడంపై ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'ఆర్ఆర్ఆర్' అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కాబట్టి పెంచడంలో అర్థముంది. కానీ ఇతర భాషల సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలు కాని వాటికి పెంచడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ.175, మల్టీప్లెక్స్ లలో రూ.295 ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలు వస్తే వాటిని రూ.210, రూ.350 చేస్తున్నారు. అసలే ఓటీటీల హవా నడుస్తున్న ఈ సమయంలో.. ఇలా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరమయ్యే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |