![]() |
![]() |

'బాహుబలి'తో తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు రాజమౌళి. ప్రస్తుతం హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లిస్టులో టాప్-3 లో రెండు సినిమాలు('బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్') రాజమౌళివి ఉన్నాయంటేనే ఆ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఈ స్థాయికి వస్తాడని ఎవరూ పెద్దగా ఊహించి ఉండరు. కానీ సీనియర్ యాక్టర్ భానుచందర్ మాత్రం రాజమౌళి ఈ స్థాయికి ఎదుగుతాడని 19 ఏళ్ళ క్రితమే ఊహించారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సింహాద్రి(2003)'. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇందులో హీరోయిన్ భూమిక తండ్రి పాత్రలో భానుచందర్ నటించారు. ఆ సినిమా టైంలోనే రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ అవుతాడని భానుచందర్ ఊహించారు. ఇప్పుడదే నిజమైంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భానుచందర్ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సింహాద్రి డబ్బింగ్ సమయంలోనే రాజమౌళితో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, ఈ సినిమా తర్వాత ఫుల్ బిజీ అవుతారని అన్నాను. అలాగే మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారని చెప్పాను. నేను చెప్పినట్లే జరిగింది" అంటూ భానుచందర్ సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళిని చూసి నేర్చుకోవాలని అంటుంటారు. తాజాగా భానుచందర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. " రాజమౌళి నుంచి సినిమా తీయడమే కాదు.. ప్రచారం చేయడం, హిట్ చేయడం నేర్చుకోవాలి. ఆయన మట్టిని పేపర్ లో పెట్టి.. వండర్ ఫుల్ చాక్లెట్ అని చెప్పి అమ్మగలడు. అలా అందరూ చేయలేరు.. దానికి స్పెషల్ టాలెంట్ కావాలి" అంటూ రాజమౌళిని ప్రశంసించారు భానుచందర్.
![]() |
![]() |