![]() |
![]() |

ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ వివాదాస్పదంగా మారింది. గతంలో అమితాబ్ బచ్చన్ సైతం పాన్ మసాలా యాడ్ చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ వివాదంలో మరి కొందరు స్టార్స్ చిక్కుకున్నారు. అజయ్ దేవ్ గణ్ ఈ యాడ్స్ లో ఎప్పటినుంచో నటిస్తున్నాడు. ఇక తాజాగా అజయ్ తో కలిసి అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ నటించిన యాడ్ విమర్శలకు దారి తీసింది. దీంతో ఆడియెన్స్ కి క్షమాపణలు చెప్పిన అక్షయ్ ఇకమీదట ఇలాంటి యాడ్స్ లో నటించనని చెప్పాడు. అయితే అజయ్ మాత్రం ఆ ప్రొడక్ట్స్ అమ్మితే లేని తప్పు, ఆ ప్రకటనల్లో నటిస్తే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ పాన్ మసాలా యాడ్స్ పుణ్యమా అని బాలీవుడ్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

అసలే సినిమాల పరంగా ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. సౌత్ సినిమాలు హిందీలో సత్తా చాటి బాలీవుడ్ సినిమాలకు మించిన కలెక్షన్స్ రాబడుతున్నాయి. 'బాహుబలి'తో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్.. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్'తో ఎక్కడికో వెళ్ళిపోయింది. సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ షేక్ అవుతోంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ హీరోలు సినిమాలపై మరింత ఫోకస్ పెట్టి.. సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా సినిమాలు తీయాల్సింది పోయి.. పాన్ మసాలా యాడ్స్ తో మరింత దిగజారి పోతున్నారంటూ దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.

సౌత్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్ పాన్ ఇండియా స్టార్స్ అయితే.. బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్ గణ్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ పాన్ మసాలా స్టార్స్ అంటూ ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలే సౌత్ సినిమాల జోరుకి ఢీలా పడిన బాలీవుడ్ కి పుండు మీద కారం చల్లినట్టు.. ఈ ట్రోల్స్ మరింత మంట పుట్టిస్తున్నాయి.
![]() |
![]() |