![]() |
![]() |

ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తాతినేని రామారావు ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్ధరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య జయశ్రీ, ఇద్దరు కుమార్తెలు చాముండేశ్వరి, నాగసుశీల, కుమారుడు అజయ్ ఉన్నారు. మహానటుడు నందమూరి తారకరామారావుతో ఆయన చేయించిన 'యమగోల' ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సినిమా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. ఇప్పటికీ మనం ఆ సినిమాను ఆస్వాదిస్తూనే ఉన్నాం.
తాతినేని రామారావు 1938లో కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరపురంలో జన్మించారు. తన కజిన్ అయిన తాతినేని ప్రకాశరావు వద్ద సహాయ దర్శకునిగా పనిచేయడం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు 9 పాత్రలు పోషించిన 'నవరాత్రి' (1966) చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అది మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. 65 వరకూ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలనూ ఆయన రూపొందించారు.
అక్కినేని నాగేశ్వరరావుతో నవరాత్రి (66), బ్రహ్మచారి (67), భలేరంగడు (69), సుపుత్రుడు (71), భార్యాబిడ్డలు (72), రైతు కుటుంబం (72), మరపురాని మనిషి (73), దొరబాబు (74), ఆలుమగలు (77), శ్రీరామరక్ష (78) చిత్రాలు...
ఎన్టీ రామారావుతో యమగోల (77), ఆటగాడు (80), అనురాగ దేవత (82) చిత్రాలు...
కృష్ణతో మంచి మిత్రులు (69), పచ్చని కాపురం (85), అగ్ని కెరటాలు (88) చిత్రాలు...
శోభన్‌బాబుతో జీవన తరంగాలు (73), దేవుడు చేసిన పెళ్లి (75), రాజు వెడలె (76), పండంటి జీవితం (81), ఇల్లాలు (81), ముగ్గురు మొనగాళ్లు (83) చిత్రాలు...
బాలకృష్ణతో ప్రెసిడెంట్ గారి అబ్బాయి (87), ప్రాణానికి ప్రాణం (90), తల్లితండ్రులు (91) చిత్రాలను ఆయన తీశారు.
తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'గోల్‌మాల్ గోవిందం' (1992).
తాతినేని రామారావు మృతికి పలువురు చిత్ర ప్రముఖులతో పాటు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సంతాపం తెలియజేసింది.
![]() |
![]() |