![]() |
![]() |

తెలుగునాట హ్యాట్రిక్ విజయాలు అందుకున్న అతి కొద్ది కాంబినేషన్స్ లో మాస్ మహారాజా రవితేజ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబో ఒకటి. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` (2001), `ఇడియట్` (2002)తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్.. `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` (2003)తో హ్యాట్రిక్ చూసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రవితేజకి అమ్మగా జయసుధ, నాన్నగా ప్రకాశ్ రాజ్, తమిళ అమ్మాయిగా అసిన్ దర్శనమిచ్చారు. అలీ, సుబ్బరాజు, ఐశ్వర్య, ధర్మవరపు సుబ్రమణ్యం, ఉమ, ఎమ్మెస్ నారాయణ, పృథ్వీరాజ్, గౌతం రాజు, అల్ఫోన్సా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
చక్రి సంగీతమందించిన ఈ చిత్రంలో.. ``నీవే నీవే``, ``చెన్నై చంద్రమా``, ``లంచ్ కొస్తావా``, ``చుమ్మా చుమ్మా``, ``తళుకు తళుకు``, ``జుమ్ జుమారే`` అంటూ సాగే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. `తృతీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ గుణ చిత్ర నటుడు` (ప్రకాశ్ రాజ్), `ఉత్తమ మాటల రచయిత` (పూరీ జగన్నాథ్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ నటి`, `ఉత్తమ సహాయ నటి` (జయసుధ), `ఉత్తమ హాస్య నటుడు` (అలీ) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకున్న `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`.. తమిళంలో `ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి`, కన్నడలో `మౌర్య`, ఒడియాలో `కథ దేయ్తిలి మా కు`, భోజ్ పురిలో `జిగర్ వాలా` పేర్లతో రీమేక్ అయింది. 2003 ఏప్రిల్ 19న విడుదలై ఘనవిజయం సాధించిన `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`.. నేటితో 19 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |