![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ నటజీవితంలో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `వాసు` ఒకటి. వెంకీ కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని.. వెంకటేశ్ తో `చంటి` (1992) వంటి ఇండస్ట్రీ హిట్ ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్. రామారావు సరిగ్గా పదేళ్ళ తరువాత నిర్మించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీకి జోడీగా భూమిక నటించగా విజయ్ కుమార్, మంజుల, వర్ష, అలీ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, రంగనాథ్, బ్రహ్మాజీ, అచ్యుత్, రఘునాథ్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. చిత్ర దర్శకుడు కరుణాకరన్ అతిథి పాత్రలో మెరిశారు.
కథ విషయానికి వస్తే.. వాసు (వెంకటేశ్)కి సంగీతమంటే ప్రాణం. గొప్ప గాయకుడు కావాలనేది అతని కల. అయితే, ఐపీయస్ ఆఫీసర్ అయిన అతని తండ్రి (విజయ్ కుమార్) మాత్రం వాసుని ఐపీయస్ ఆఫీసర్ గానే చూడాలనుకుంటాడు. ఈ క్రమంలో.. దివ్య (భూమిక) అనే అమ్మాయితో వాసుకి పరిచయమవుతుంది. పలు నాటకీయ పరిణామాల తరువాత కెరీర్, ప్రేమలో వాసు ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మిగిలిన సినిమా.
హేరిస్ జైరాజ్ సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``పాటకు ప్రాణం``, ``పాడనా తీయగా``, ``నమ్మవే అమ్మాయి``, ``వాలే వాలే``, ``ఓ ప్రేమా``, ``స్పోర్టివ్ బాయ్స్``తో పాటు ఇందులోని మ్యూజిక్ బిట్స్ కూడా సంగీత ప్రియులను రంజింపజేశాయి. `బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్` (ఎస్పీ బాలసుబ్రమణ్యం - పాడనా తీయగా) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `వాసు`.. 2002 ఏప్రిల్ 10న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ ఆదివారంలో ఈ మ్యూజికల్ హిట్ 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |