![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు జూనియర్ ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ మధ్య వచ్చే సన్నివేశాల కంటే రామ్ చరణ్-ఆలియా భట్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువ ఉంటాయని భావించారంతా. కానీ విడుదల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆలియాతో పోల్చితే ఒలీవియా సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. జెన్నీఫర్ పాత్రలో ఒలీవియా ఒదిగిపోయింది. ముఖ్యంగా తారక్-ఒలీవియా మధ్య వచ్చే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఒలీవియా.. తారక్ నటనపై ప్రశంసలు కురిపించింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా అంతా ఒకెత్తు అయితే 'కొమురం భీముడో' సాంగ్ లో తారక్ నటన మరో ఎత్తు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఒలీవియా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ చాలా గొప్ప నటుడని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొనియాడింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమా చూశానని.. కొమురం భీముడో సాంగ్ లో తారక్ నటనకు తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పింది.
చరణ్ మంచి ఫ్రెండ్ అయ్యాడని, తామిద్దరం లండన్ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడుకునేవాళ్లమని తెలిపింది. రాజమౌళి గొప్ప దర్శకుడు అని.. ఏ సీన్ ఎలా తెరకెక్కించాలో, నటినటులను ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసని ప్రశంసించింది. ఆర్ఆర్ఆర్ లో 'నాటు నాటు' సాంగ్ తనకి ఎంతో ఇష్టమని, ఈ పాటకి తన బాయ్ ఫ్రెండ్ కూడా ఫ్యాన్ అయ్యాడని తెలిపింది. తరచూ ఇదే సాంగ్ పాడుతున్నాడని, డ్యాన్స్ కూడా ట్రై చేస్తున్నాడని ఒలీవియా చెప్పుకొచ్చింది.
![]() |
![]() |