![]() |
![]() |

వినోదంతో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమాలను అందించే దర్శకులు అరుదుగా ఉంటారు. తెలుగులో ఆ జాబితాలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కరుణ కుమార్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'పలాస1978' సినిమా విడుదలై మూడేళ్ళు కావొస్తున్నా ఇప్పటికీ పలాస పేరు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంది.
దళిత పాలిటిక్స్ బేస్ చేసుకొని నిర్మించిన సినిమాలను ఎంపిక చేసి 'వానమ్ ఆర్ట్స్ ఫెస్టివల్' ని 'నీలమ్ ఆర్ట్స్ కల్చరల్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు తమిళ ప్రముఖ దర్శకుడు పా రంజిత్. చెన్నైలో ఈ నెల 9, 10,11 లలో p.k.rose ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట జరగబోయే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోయే సినిమాలలో 'పలాస 1978' కూడా ఎంపిక అయ్యింది

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ "దళిత జీవనాన్ని, దళిత జీవిత కథా చిత్రాన్ని కథా వస్తువులుగా తీసుకునే పా రంజిత్ 2018 లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ జరగబోతుంది. ఏప్రిల్ నెలను దళిత్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ మహాశయుని పుట్టిన రోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. దళిత పాలిటిక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని చేసిన సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమాల పక్కన పలాస 1978 సినిమా కు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫెస్టివల్ లో భాగం అయినందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేస్తే దాన్ని భుజాన వేసుకొనే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు అని పలాసతో నాకు అనుభవంలోకి వచ్చింది." అన్నారు.
![]() |
![]() |