![]() |
![]() |

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీ తెలుగునాట కలెక్షన్ల సునామీతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ. 17.50 కోట్ల షేర్‌ను వసూలుచేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం రూ. 74.11 కోట్లు, శనివారం రూ. 31.63 కోట్లు, ఆదివారం రూ. 33.53 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. వెరసి.. నాలుగు రోజుల్లో ఈ ఫిల్మ్ తెలుగునాట వసూలు చేసిన మొత్తం రూ. 156.77 కోట్ల షేర్‌కు చేరుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజుకు సంబంధించి మునుపటి రికార్డు రాజమౌళి మునుపటి సినిమా 'బాహుబలి 2' పేరిట ఉంది. ఆ సినిమా విడుదలైన 4వ రోజు రూ. 14.65 కోట్ల షేర్ వసూలు చేయగా, ఇప్పుడు ఆ రికార్డును రూ. 17.50 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ విలువ రూ. 191 కోట్లని అంచనా. అంటే నాలుగు రోజులకే 82 శాతం రికవరీ సాధించిందన్న మాట.
తొలి మూడు రోజుల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయనేది నిజం. పెంచిన టికెట్ ధరలను సోమవారం హైదరాబాద్‌లో తగ్గించారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో టికెట్ ధరలు మామూలు స్థితికి వచ్చాయి. అందుకు అనుగుణంగా కలెక్షన్లు కూడా తగ్గాయి. అయినప్పటికీ రూ. 17.50 కోట్ల షేర్ రావడంపై డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సునాయాసంగా ఈ సినిమా బ్రేకీవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |