![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `చక్రం` ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో చక్రంగా టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో అలరించాడు ప్రభాస్. అతనికి జోడీగా అసిన్, ఛార్మి నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ఊర్వశి, తనికెళ్ళ భరణి, రాధాకుమారి, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు, శ్రీనివాస రెడ్డి, భువనేశ్వరి, శివారెడ్డి, ఏవీయస్, కల్పన, పద్మనాభం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా బ్రహ్మానందం అతిథి పాత్రలో అలరించారు.
చక్రి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్, కందికొండ సాహిత్యమందించారు. పాటల్లో ``జగమంతా కుటుంబం నాది``, ``ఒకే ఒక మాట`` చార్ట్ బస్టర్స్ గా నిలగా.. ``కొంచెం కారంగా``, ``నా పేరు చక్రం``, ``సోనీ సెల్ ఫోన్``, ``రంగేళి హోలి`` గీతాలు కూడా రంజింపజేశాయి. గీతాచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి. వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన `చక్రం` కమర్షియల్ గా మెప్పించకపోయినా.. `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ గీత రచయిత` (జగమంత - `సిరివెన్నెల`) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుంది. 2005 మార్చి 25న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `చక్రం`.. నేటితో 17 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |