![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించినప్పటి నుంచే 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ కీలక పాత్రలలో కనిపించనున్నారని తెలియడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 25) విడుదలైన ఆర్ఆర్ఆర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర బలంగా గుర్తుండిపోతుంది. అదే అజయ్ దేవ్గణ్ పోషించిన వెంకట్రామరాజు పాత్ర.
అజయ్ దేవ్గణ్ పాత్ర 'ఆర్ఆర్ఆర్'కి ఆత్మ వంటిదని విడుదలకు ముందే రాజమౌళి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే సినిమా చూసిన ప్రేక్షకులకు అదే అభిప్రాయం కలుగుతోంది. ఆ పాత్ర నిడివి ఉన్నది తక్కువే సేపే అయినప్పటికీ.. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. వెంకట్రామరాజు పాత్రలో అజయ్ దేవ్గణ్ కనిపించే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రలో అజయ్ దేవ్గణ్ జీవించేశాడు. ఆయన ఆశయంతోనే ఆర్ఆర్ఆర్ మెయిన్ కథ నడుస్తుంది. అందుకే ఆ పాత్ర 'ఆర్ఆర్ఆర్'కి ఆత్మ అని రాజమౌళి అన్నాడు. అంత కీలక పాత్రలో నటించిన అజయ్ దేవ్గణ్ తన నటనతో ఆ పాత్రని, సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలో ఆయన తక్కువసేపే కనిపించినా.. ఎక్కువ మార్క్ లు కొట్టేశాడంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
![]() |
![]() |