Home  »  News  »  'ఆర్ఆర్ఆర్'తో తారక్ ఫ్యాన్స్ డిజప్పాయింట్.. జక్కన్న లెక్క తప్పిందా?

Updated : Mar 25, 2022

ఎన్టీఆర్, ఏఎన్నార్ టైములో మల్టీస్టారర్ సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎగబడి చూసేవాళ్ళు. కృష్ణ, శోభన్ బాబు వరకు కూడా ఆ ట్రెండ్ నడించింది. కానీ తర్వాత తర్వాత ఫ్యాన్ వార్స్ కి భయపడి ఇద్దరు ఈక్వల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ తో సినిమా చేసే సాహసం ఎవరూ చేయలేదు. చాలా ఏళ్ళ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఆ సాహసం చేశాడు. అదే 'ఆర్ఆర్ఆర్'.

ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. మెగా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్స్ తో సినిమా అంటే.. ఎవరి పాత్ర కొంచెం తగ్గినా ఫ్యాన్స్ గొడవ చేసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే రాజమౌళి మాత్రం తాను ఆ ఫ్యాన్ లెక్కలు పట్టించుకోకుండా, కథకు అవసరమైనట్లు ఆ పాత్రలకు తెరకెక్కించానని తెలిపారు. హీరోలు సైతం ఇక మీదట ఈ ఫ్యాన్ లెక్కలు ఉండవని, ముందు ముందు ఇలాంటి మల్టీస్టారర్స్ ఎన్నో వస్తాయని అభిప్రాయపడ్డారు. కానీ వీళ్ళు ఎన్ని చెప్పినా తమ హీరోని ఎలా చూపించారన్న లెక్కలేసుకునే ఫ్యాన్స్ సినిమాని చేస్తారన్న విషయాన్ని మరిచారు. అదే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ నిరాశకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సినిమా విడుదలకు ముందు నుంచే తమ హీరోదే మెయిన్ రోల్ అంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదనకు దిగారు. ఎక్కువగా తారక్ పాత్ర హైలైట్ అయ్యే అవకాశముందని భావించారంతా. అందుకు తగ్గట్లే సినిమా ఫస్టాఫ్ లో తారక్ పోషించిన భీమ్ పాత్రదే మెయిన్ స్టోరీ అన్నట్లుగా సాగింది. కానీ తర్వాత తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భీమ్ కేవలం మల్లి అనే ఒక గోండ్ల పిల్ల కోసం పోరాడుతుంటే.. రామ్ మట్టి కోసం, ఒక గొప్ప లక్ష్యం పోరాడుతున్నట్లు చూపించారు.

ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ పోటాపోటీగా ఉన్నాయి. ఇంటర్వెల్ కి ముందు తారక్ పోషించిన భీమ్ పాత్రదే పైచేయి. అలాగే ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ హవా కొనసాగింది. 'కొమురం భీముడో' సాంగ్ వచ్చే ఎపిసోడ్ లో అయితే తారక్ తన నటనతో కట్టిపడేశాడు. అయితే సినిమా చివరికి వచ్చేసరికి భీమ్ పాత్రకి ప్రాధాన్యత తగ్గినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ లో కాసేపటికే భీమ్ లక్ష్యం నెరవేరుతుంది. ఆ తర్వాత రామ్ గురించి తెలుసుకొని, రామ్ లక్ష్యం కోసం పనిచేస్తాడు. అంతేకాదు క్లైమాక్స్ ఫైట్ లో ఫైర్ గా రామ్ ని చూపించినంత పవర్ ఫుల్ గా, వాటర్ గా భీమ్ ని పవర్ ఫుల్ గా చూపలేదు. దాంతో సినిమా అంతా ఎంత బాగా చూపించినా చివరి 30 నిమిషాలు రామ్ ని హైలైట్ చేయడంతో.. తారక్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే వారికి చివరి 30 నిమిషాలే ఎక్కువగా ఉంటుంది.. అలాంటిది ఆ కీలక సమయంలో భీమ్ పాత్ర తగ్గించడంతో తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.