![]() |
![]() |

కింగ్ నాగార్జున, కామాక్షి ఆర్ట్ మూవీస్ సంస్థ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేశాయి. వాటిలో `విక్కీ దాదా` ఒకటి. పరిస్థితుల ప్రభావంతో విక్కీ దాదా అనే క్రిమినల్ గా మారిన లా స్టూడెంట్ విక్రమ్ కథే ఈ సినిమా. టైటిల్ రోల్ లో నాగార్జున అభినయం చిత్రానికి ప్రధానబలంగా నిలిచింది. నాగ్ కి జోడీగా జూహీ చావ్లా, రాధ నటించిన ఈ సినిమాలో శ్రీవిద్య, కన్నడ ప్రభాకర్, గొల్లపూడి మారుతి రావు, గిరిబాబు, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, ప్రసాద్ బాబు, వినోద్, వంకాయల, భీమేశ్వర రావు, వరలక్ష్మి, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించగా, పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
రాజ్ - కోటి సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``ఓ బేబి నీ మీద బెంగపడ్డా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``బ్యూటీ బ్యూటీ``, ``గంట గంటకి మోతగుంటాది``, ``జారిందమ్మో జారిందమ్మో``, ``అబ్బ టక్కు టిక్కు`` గీతాలు కూడా రంజింపజేశాయి. పాటలన్నింటికీ దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. 1989 మార్చి 11న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `విక్కీదాదా`.. నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |