![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల అంశంపై జగన్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. 'వకీల్ సాబ్'తో మొదలైన ఈ వివాదం 'భీమ్లా నాయక్'తో ముగిసింది. ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ వే కావడం విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా వాళ్ళను రాజకీయంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఏపీ ప్రభుత్వంపై వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వ తీరుని పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఒకానొక సమయంలో ప్రభుత్వానికి, సినిమా వారికి మధ్య మాట యుద్ధమే జరిగింది. వివాదం రోజురోజుకీ ముదురుతుండటంతో సినీ పెద్దలు రంగంలోకి ప్రభుత్వాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. చిరంజీవి అయితే సీఎం జగన్ చేతులు జోడించి అడిగారు. దీంతో దిగొచ్చిన జగన్ సర్కార్ ధరలను సవరించి కొత్త జీవో ఇస్తామని హామీ ఇచ్చింది.
'భీమ్లా నాయక్' మూవీ విడుదలకు కొద్దిరోజుల ముందు టికెట్ ధరలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు జీవో వచ్చే అవకాశం లేదని భావించారంతా. ఊహించినట్లుగానే ప్రభుత్వం అలాగే చేసింది. భీమ్లా నాయక్ విడుదలైన పది రోజుల తర్వాత, రెండు వీకెండ్స్ ముగిశాక జీవో వచ్చింది. ఈ జీవో ముందు ఇచ్చి ఉంటే భీమ్లా నాయక్ మరో పది పదిహేను కోట్లు అదనంగా కలెక్ట్ చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భీమ్లా నాయక్ తో పాటు ఇటీవల బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన 'అఖండ', 'పుష్ప' కలెక్షన్స్ పై కూడా ఏపీలో టికెట్ ధరలు కొంత ప్రభావం చూపాయి.

సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. టికెట్ ధరలు కనిష్టంగా 20రూపాయలు, గరిష్టంగా 250 వరకూ నిర్ణయించింది. అలాగే రెమ్యునరేషన్స్ మినహాయించి వంద కోట్ల రూపాయలు బడ్జెట్ దాటిన సినిమాలకు పది రోజుల దాకా ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్ల పెంపు వర్తిస్తుందని షరతు పెట్టింది. అలాగే ఐదో షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల లోపు స్మాల్ బడ్జెట్ సినిమాలకు ఖచ్చితంగా ఒక షో కేటాయించాలని చెప్పింది. ఆ సినిమాల బడ్జెట్ రెమ్యునరేషన్స్ తో కలిపి 20 కోట్ల బడ్జెట్ మించకూడదని పేర్కొంది.
సినిమా టికెట్ ధరలు సవరిస్తూ జగన్ సర్కార్ కొత్త జీవో ఇవ్వడంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తరఫున ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పవన్ రెండు సినిమాలకు నష్టం కలిగాక వచ్చిన టికెట్ ధరల పెంపు జీవో కొన్ని సినిమాలకు వరం కానుంది. ముఖ్యంగా త్వరలో విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలు 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్'కు ఈ జీవో లాభం చేకూర్చనుంది. 20శాతం షూటింగ్ ఏపీలో చేసి ఉండాలన్న షరతు నుంచి ఈ రెండు సినిమాలకు మినహాయింపు లభించింది. ఇక మీదట వచ్చే భారీ బడ్జెట్ సినిమాలకు ఈ షరతు వర్తించనుంది.
![]() |
![]() |