![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో `రుద్రవీణ` ఒకటి. నాటి మేటి దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ఈ మ్యూజికల్ డ్రామాలో.. మహామహులు కలలు కన్న మరో ప్రపంచాన్ని నిజం చేసే యువ నాయకుడు సూర్యనారాయణ శాస్త్రి (సూర్యం)గా తనదైన అభినయంతో అలరించారు చిరు. అలాగే `స్పెషల్ జ్యూరీ` విభాగంలో `నంది` అవార్డుని సొంతం చేసుకున్నారు. చిరుకి తండ్రిగా `బిళహరి` పాత్రలో జెమినీ గణేశన్ నటన కూడా ఈ సినిమాకి మరో ప్రధాన బలంగా నిలిచింది. శోభన కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రసాద్ బాబు, పి.ఎల్. నారాయణ, సుమిత్ర, రమేశ్ అరవింద్, దేవీలలిత, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా కైకాల సత్యనారాయణ అతిథి పాత్రలో దర్శనమిచ్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని కూడా విశేషాదరణ పొందాయి. ``నమ్మకు నమ్మకు``, ``తరలిరాదా``, ``లలితప్రియ``, ``చెప్పాలని``, ``చుట్టుపక్కల``, ``నీతోనే``, ``రండి రండి``, ``మానవ సేవ``, ``తులసీ దళములచే``.. ఇలా దిగ్గజ గీతరచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలన్ని రంజింపజేశాయి. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె. నాగేంద్రబాబు తొలిసారిగా నిర్మించిన ఈ మ్యూజికల్ డ్రామా.. `ఉత్తమ జాతీయ సమైగ్రత చిత్రం`, `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ నేపథ్యగాయకుడు` (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) విభాగాల్లో `జాతీయ` పురస్కారాలను, `ఉత్తమ మాటల రచయిత` (గణేశ్ పాత్రో), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ (పాండురంగం), స్పెషల్ జ్యూరీ (చిరంజీవి) విభాగాల్లో `నంది` అవార్డులను అందుకుంది. అలాగే, తమిళంలో `ఉన్నాల్ ముడియమ్ తంబి` (కమల్ హాసన్) పేరుతో రీమేక్ అయింది. 1988 మార్చి 4న విడుదలై జననీరాజనాలు అందుకున్న `రుద్రవీణ`.. నేటితో 34 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |