![]() |
![]() |
.webp)
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో ప్రచారాలు వచ్చినా, అవేవీ నిజం కాలేదు. ప్రస్తుతం ఆయన తన లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే శ్యామ్' విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మూవీ మార్చి 11న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో క్రేజీ ప్రాజెక్టుగా రిలీజవుతోంది. 'మిర్చి' మూవీ నుంచి ఆయనను యాక్షన్ హీరోగా చూసిన ఆడియెన్స్ ఇందులో రొమాంటిక్ హీరోగా డిఫరెంట్ అవతారంలో చూడబోతున్నారు.
సందర్భవశాత్తూ 'రాధే శ్యామ్'లో హస్తసాముద్రికునిగా నటించిన ప్రభాస్, పెళ్లిపై తన ఊహాగానాలు నిజం కాలేదనీ, అందుకే ఇంతదాకా తనకు పెళ్లి కాలేదనీ ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పాడు. పెళ్లి చేసుకొనమని తన తల్లి తరచూ పోరుపెడుతుంటుందని ఆయన వెల్లడించాడు. "ఇంట్లో దీని గురించి ఎప్పుడూ మాటలు నడుస్తూనే ఉంటాయి. అది సాధారణమే. ప్రతి తల్లీ తన పిల్లలు పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలనీ, వాళ్ల పిల్లలను ఆడించుకుంటూ గడపాలనీ అనుకుంటుంది. మా అమ్మ కూడా అంతే. నేను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనేది ఆమె కోరిక. 'బాహుబలి' టైమ్‌లో, ఆ సినిమా పూర్తయి, రిలీజయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాను. ఇప్పుడు, ఆ అవకాశం నాకు లేదు. అందుకని నాపై ఒత్తిడి తీసుకురావద్దనీ, అది జరుగుతుందనీ చెప్తున్నా. నాకూ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనే ఉంది. సరైన టైమ్‌లో అది జరుగుతుంది." అని చెప్పాడు ప్రభాస్.
ఆసక్తికరమైన విషయమేమంటే తన జీవితంలో ఇంతదాకా ఆయన జ్యోతిష్కుడిని కలవలేదు. "నేను విధిని నమ్ముతాను. కానీ నేనెప్పుడూ నా చేతిని ఏ జ్యోతిష్కునికీ చూపించలేదు. ఈ సినిమాలో హస్తసాముద్రికుని పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు, ఇంతదాకా ఆ తరహా పాత్ర చేయనందున నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది" అని ఆయన తెలిపాడు.
రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన 'రాధే శ్యామ్' మూవీని గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కునాల్‌రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రి ప్రధాన పాత్రధారులు కాగా, కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
![]() |
![]() |