![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదలై భారీ కలెక్షన్స్ తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలకు ముందు రానా పాత్రపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. రానా పాత్రని తగ్గించి ఉంటారని, పవర్ ఫుల్ గా డిజైన్ చేసి ఉండరని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ విడుదల తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. భీమ్లా నాయక్ కి ధీటుగా రానా పోషించిన డేనియల్ శేఖర్ పాత్రని తీర్చిదిద్దారు. రానా నటనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన రానా సినిమా గురించి, తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ లోకి తానే ముందు వచ్చానని చెప్పిన రానా.. పవన్ కళ్యాణ్ వస్తారని అసలు ఊహించలేదని అన్నారు. ప్రొడ్యూసర్ నాగ వంశీని ఎన్నోసార్లు తనతో నటించే ఇంకో యాక్టర్ ఎవరని చాలాసార్లు అడిగానని, కానీ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పేవాళ్ళని తెలిపారు. అలా కొన్ని నెలలు గడిచాక ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేక ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారా అనుకున్నానని చెప్పారు. అయితే సడెన్ గా ఒకరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని తెలియగానే చాలా ఎగ్జైట్ అయ్యానని రానా అన్నారు.
ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ ని డామినేట్ చేశారని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారని మీడియా వ్యక్తులు ప్రస్తావించగా రానా దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. "చాలా మంది మంచిగా ఉండే క్యారెక్టర్స్ కంటే, చెడ్డగా బిహేవ్ చేసే క్యారెక్టర్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. అలాగే మూవీలో నా పాత్రకి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు" అని రానా అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకి ఏం కావాలో పవన్ అదే చేశారని, ఆయన కాస్ట్యూమ్స్ కూడా పాత్రకి తగ్గట్లే ఉంటాయని అన్నారు. ఈ సినిమా తర్వాత తనకి కూడా కమర్షియల్ సినిమాలు చేయాలనిపించిందని రానా చెప్పుకొచ్చారు.
![]() |
![]() |