![]() |
![]() |

ఎస్తర్ నోరోన్హ.. డైరెక్టర్ తేజ తీసిన '1000' అబద్ధాలు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, 'భీమవరం బుల్లోడు' మూవీలో సునీల్ జోడీగా అలరించింది. ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పి. సునీల్‌కుమార్ రెడ్డి రూపొందించిన '#69 సంస్కార్ కాలనీ' మూవీలో మెయిన్ లీడ్‌గా మన ముందుకు రాబోతోంది. రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన ఆ సినిమా ట్రైలర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్యగా ఒక బోల్డ్ రోల్‌లో ఎస్తర్ కనిపించనున్నదని అర్థమైంది. ఆ మూవీలో ఆమెకు లిప్‌లాక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. ఒక యాక్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాననీ, వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని ఆలోచించలేదనీ తెలుగువన్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పింది ఎస్తర్.
"ఇంతదాకా ఇలాంటి బోల్డ్ సినిమా నేను చేయలేదు. నేను ప్రతి లాంగ్వేజ్‌లో 'భీమవరం బుల్లోడు'లో చేసినటువంటి పాత్రలే చేశాను. నేను చేసిన పెద్ద సినిమాల్లో 'షకీలా' ఒకటి. అది పాన్ ఇండియన్ ఫిల్మ్. అందుకే అందులో రేష్మ క్యారెక్టర్‌ను ఎంచుకున్నాను. ఒక ఆర్టిస్టుగా ఒక ఆకలి ఉంటుంది, కొత్తకొత్తగా ఏమైనా చెయ్యాలని. ఆర్టిస్టుగా ఎదగాలని ఉంటుంది. అలాగే నా కెరీర్‌కు ఇది బ్యాడ్ అవుతుందేమోననే భయం కూడా ఉంటుంది. ఏ జాబ్ చేసేవాళ్లయినా జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ వెతుక్కుంటారు. నేను నటిగా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు నేను కూడా జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ కోసం చూసుకున్నాను." అని ఆమె చెప్పింది.
కొత్తగా ఏదైనా చేశాననే హ్యాపీనెస్, ఫుల్‌ఫుల్‌మెంట్ ఉండాలనీ, అలా చాలా భయంతో తీసుకున్న స్టెప్.. 'షకీలా' మూవీ అనీ ఎస్తర్ తెలిపింది. "అందులో నాకు చాలా గుర్తింపు, ప్రశంసలు లభించాయి. ఆ మూవీలో పంకజ్ త్రిపాఠి, రిచా చడ్ఢా లాంటి ఆర్టిస్టులతో కలిసి పనిచేసినప్పుడు, నా లిమిటేషన్స్ నుంచి లిబరేట్ అవ్వాలనిపించింది. నేను ఎస్తర్‌గా ఆలోచిస్తుంటే రేష్మ (షకీలా) అవ్వలేను, వైశాలి (#69 సంస్కార్ కాలనీ) అవ్వలేను. ఎస్తర్‌గానే ఉండిపోతాను. ఒక పాత్ర నేను ఒప్పుకొనేటప్పుడు ఆ డైరెక్టర్‌తో నాకు కంఫర్ట్ ఉంటుందా, లేదా అని చూసుకోవాలి. వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని కాదు, నేను యాక్టర్‌గా ఎదగాలా, లేదా.. అది చూసుకుంటాను." అని ఆమె స్పష్టం చేసింది.

ఆడియెన్స్ కూడా మారిపోయారనీ, వాళ్లు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారనీ ఎస్తర్ అభిప్రాయపడింది. "కరోనా టైమ్స్‌లో వాళ్లు ఇంటర్నేషనల్ కంటెంట్‌ను కూడా చూశారు. కొరియన్ డ్రామాలు, స్పానిష్ డ్రామాలు చూశారు. రియల్ లైఫ్‌కు, పర్ఫార్మెన్స్‌కు మధ్య డిఫరెన్స్‌ను వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. ఈ స్టోరీతో సునీల్‌కుమార్ రెడ్డి నన్ను సంప్రదించినప్పుడు, ఇది కరెక్టుగా చేస్తే జనం మెచ్చుకుంటారని అనిపించింది. ఆయన వెరీ సౌండ్ టెక్నీషియన్, మంచి రెప్యుటేషన్ ఉన్న డైరెక్టర్, సెన్సిబుల్ ఫిల్మ్‌మేకర్ అని అదివరకే విన్నాను. పదిమందిలో ఒక పాత్రలా కాకుండా, ఒక సీరియస్ సినిమాలో బలమైన క్యారెక్టర్ చెయ్యాలనే కోరిక నాలో ఉంది. తెలుగులో చేసిన కొద్ది పనికే నాకు ఇంత ప్రేమ, ఇంత గుర్తింపు లభించినప్పుడు ఒక సెన్సిబుల్, సీరియస్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. ఆ స్కోప్ నాకు ఈ సినిమాలో కనిపించింది. అయితే జనాలు దాన్ని ఎలా తీసుకుంటారోననే భయం వచ్చింది." అని చెప్పిందామె.
కొన్ని రకాల సినిమాలను ఎలా ట్రీట్ చెయ్యాలో తెలుగు ప్రేక్షకులకు ఇవాళ బాగా తెలుసనీ, ఒక సినిమాని ఎలా సెలబ్రేట్ చేయాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసినట్లు ఇంకొకరికి తెలీదనీ ఎస్తర్ అంటోంది. "ఒక ఆర్టిస్టుకు సామర్థ్యం ఉంటే దాన్ని గుర్తించి, దాన్ని సెలబ్రేట్ చేయడం వాళ్లనుంచే ఎవరైనా నేర్చుకోవాలి. ఒక ఆర్టిస్టు ఏదైనా క్రెడిబుల్‌గా చేస్తే, ఆడియెన్స్ సెలబ్రేట్ చేస్తారనేది నా నమ్మకం. ఈ డైరెక్టర్ వల్ల, ఈ స్క్రిప్టువల్ల, ఇది తెలుగు సినిమా అవడం వల్ల.. దీన్ని చెయ్యాలనుకున్నాను. ట్రైలర్ రిలీజయ్యాక జనం మెచ్చుకుంటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆడియెన్స్ నుంచీ, మీడియా నుంచీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది." అని ఆమె చెప్పుకొచ్చింది.
![]() |
![]() |