![]() |
![]() |

శీతాకాలంలో ఏదో మ్యాజిక్ ఉంటుందనేది చాలామందికి అనుభవమే. ప్రేమికులకు శీతాకాలం మరపురాని అనుభవాలనిస్తుంది. మంచులో తడిసి ముద్దయ్యే ఆ కాలంలో ఎన్ని జ్ఞాపకాలు! అలాంటి మధుర జ్ఞాపకాలు మన హీరోకు కూడా ఉన్నాయ్. 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ చూస్తుంటే.. హీరో సత్యదేవ్ నాలుగుసార్లు ప్రేమలో పడతాడనీ, అదీ శీతాకాలంలోనే అనీ అర్థమవుతుంది. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని ఆ కాలంలో కళ్లకు ఏ అమ్మాయి నచ్చినా, ఆమె అతడికి లైఫ్ పార్టనర్ అవుతుందనిపిస్తుంది. అలా స్కూల్ డేస్‌లో కోమలి, కాలేజ్ డేస్‌లో అమ్ము (కావ్య శెట్టి), జర్నీలో దివ్య (మేఘా ఆకాశ్), ఫైనల్‌గా నిధి (తమన్నా)తో ప్రేమలో పడతాడు.
శీతాకాలం వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త అందాల్ని మోసుకొచ్చి అతడిని ఊపిరాడకుండా చేసింది. వీళ్లలో అతడి లైఫ్ పార్టనర్ ఎవరు? సమాధానం కోసం ఆలోచిస్తుంటే గాలిలో మెల్లగా చల్లగా వినిపించింది.. 'గుర్తుందా శీతాకాలం' అని. ఈ మూవీలో ప్రేమ ఊసులు మాత్రమే కాదు, ఆ ప్రేమ కోసం కొట్లాటలు కూడా ఉంటాయని ట్రైలర్ తెలియజేస్తోంది.
ఆర్. నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించారు. కాలభైరవ సంగీతం సమకూర్చగా, లక్ష్మీ భూపాల మాటలు రాశారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

![]() |
![]() |