![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీ సమస్యలను చర్చించి, పరిష్కరించుకోవడానికి గురువారం మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్‌లతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్లడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తెలంగాణలో లేని సమస్యలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకున్నాయి? అనే ప్రశ్న వేసుకుంటే చాలామందికి అందులోనే సమాధానం లభిస్తుంది. సినిమా టికెట్ ధరల సమస్య అనేది కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో నలుగుతోంది. ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాలకు తక్కువ టికెట్ ధరలవల్ల ఆదాయంలో గండిపడింది. దీంతో ఈ సమస్యతో పాటు థియేటర్లకు సంబంధించిన మరికొన్ని సమస్యల గురించి మాట్లాడటానికి స్టార్ హీరోలు, డైరెక్టర్లు జగన్ దగ్గరకు వెళ్లారు. అయితే జగన్ దగ్గరకు వెళ్లాక చిరంజీవి వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ఆయన మాట్లాడిన తీరు చూసి చాలామంది ముక్కుమీద వేలేసుకుంటున్నారు. మెగాస్టార్ లాంటి ఇమేజ్ ఉన్న చిరంజీవి అంతలా జగన్ ముందు మోకరిల్లారేమిటని ఇండస్ట్రీలోని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆయన ప్రవర్తన చూసి రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో 'సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్' అని ఓ మాట అనేశారు. నిజంగానే జగన్ ముంగిట చిరంజీవి దాసోహమైనట్లే కనిపిస్తోంది. విశాఖపట్నంలో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికి చిరు తాపత్రయపడుతున్నారనీ, అందుకే జగన్‌కు ఆయన మోకరిల్లారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నంలోనూ ఒక జూబ్లీ హిల్స్ తయారుచేద్దామని జగన్ పిలుపునివ్వడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను తాను కల్పిస్తానని కూడా జగన్ మాటిచ్చారు. అక్కడవున్న తమ ఆస్తులను కాపాడుకోవాలంటే జగన్ ప్రతిపాదనలను అంగీకరించాలని చిరుకి తెలుసు. అందుకే జగన్ ప్రపోజల్స్‌కు చిరు సానుకూలంగా స్పందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
జగన్ దగ్గరకు వెళ్లిన స్టార్స్‌ను ఓసారి గమనిస్తే.. చిరంజీవి, మహేశ్, ప్రభాస్.. ముగ్గురూ మూడు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హీరోలు. కమ్మ కులానికి వ్యతిరేకంగా జగన్ మొదట్నుంచీ గళం విప్పుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే అలాంటి ప్రచారానికి తావు లేకుండా వివిధ కులాలకు ప్రాతినిధ్యం ఉండేలా తన బృందాన్ని చిరు ఎంపిక చేసుకున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజన్‌రెడ్డి కూడా ఈ బృందంలో ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే పేర్ని నాని పిలుపు మేరకు అలీ కూడా ఈ బృందంలో సభ్యుడయ్యారు. ఇలా వివిధ కులాలు, వర్గాలకు చెందిన సినీ ప్రముఖుల బృందం జగన్‌ను కలిసింది.
గమనించదగ్గ విషయం ఏమంటే గత నెల జగన్ ఇంటికి చిరంజీవి వెళ్లినప్పుడు ఆయనకు అన్ని రకాల మర్యాదలు లభించాయి. జగన్‌తో కలిసి ఆయన భోజనం చేశారు. అయితే ఈసారి వెళ్లిన బృందానికి అలాంటి మర్యాదలేమీ జరగలేదు. సినిమా సమస్యలను చర్చించడానికి వెళ్లిన బృందం జగన్‌తో చర్చలు జరిపింది, వచ్చేసింది. అందరూ కలిసి భోజనాలు చేయడాలు లేవు, కనీసం ఫలహారాలు చేసిన దాఖలా కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్సులు ఏర్పాటుచేయడానికి ప్రభాస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆయన తరపున జగన్‌తో ఈ విషయాన్ని నిరంజన్‌రెడ్డి చర్చించినట్లు అంతర్గత వర్గాల భోగట్టా.
మొత్తానికి జగన్‌తో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయనీ, సమస్యల పరిష్కారానికి జగన్ చొరవ చూపారనీ చిరుతో పాటు మహేశ్ కూడా చెప్పాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు మహేశ్. అతనే కాదు, ఇప్పుడు స్టార్స్ చాలామంది జగన్ భజన చేస్తున్నారు. చూస్తుంటే ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఒంటరివాడైపోయినట్లు కనిపిస్తోంది. ఆయన జగన్‌ను విమర్శిస్తుంటే, ఆయన అన్న చిరంజీవి మెచ్చుకుంటున్నారు. చిరుకు ఇప్పుడు చాలామంది స్టార్లు తోడయ్యారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని వింతలు చోటు చేసుకుంటాయో చూడాలి.

![]() |
![]() |