![]() |
![]() |

సినిమా టికెట్ ధరల అంశంతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ భేటీలో చిరంజీవితో పాటు నారాయణమూర్తి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. అన్ని విషయాలపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ భేటీ పట్ల తాము సంతోషంగా ఉన్నామని అన్నారు.
భేటీకి ముందు ఈరోజుతో సమస్యలకు శుభం కార్డు పడుతుందని చెప్పిన చిరంజీవి.. చెప్పినట్లుగానే భేటీ అనంతరం శుభం పడినట్లే అని అన్నారు. "ఈరోజు శుభం కార్డు పడిందని మేం సంతోషంగా చెప్తున్నాం. మమ్మల్ని చర్చకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సినీ పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకవైపు పేద ప్రజలకు వినోదాన్ని అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు, మరోవైపు ఇండస్ట్రీకి రెవిన్యూ వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలను కాపాడటం కోసం మా అందరి కోరికను మన్నించి ఐదో షో పెట్టడానికి ఆయన ఆమోదం తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకి గుర్తింపు తీసుకొస్తున్న భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కలిగేలా కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
తెలంగాణలోలాగే ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, అందుకు తగిన సహకారం అందిస్తామని జగన్ చెప్పినట్లు మెగాస్టార్ తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడటానికి ప్రత్యేక చొరవ చూపిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చిరంజీవి అన్నారు. ఈ నెలాఖరు లోపల జీవో వచ్చే అవకాశముందని మెగాస్టార్ చెప్పారు.
![]() |
![]() |