![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన నవలాధారిత చిత్రాల్లో `ఈతరం మనిషి` ఒకటి. మాదిరెడ్డి సులోచన రచించిన `మిస్టర్ సంపత్ ఎం.ఎ` నవల ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రఖ్యాత దర్శకుడు వి. మధుసూదనరావు రూపొందించారు. లక్ష్మీ, జయప్రద నాయికలుగా నటించిన ఈ సినిమాలో అంజలీ దేవి, రావు గోపాల రావు, గుమ్మడి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, గిరిబాబు, సాక్షి రంగరావు, నిర్మలమ్మ, బేబి రోహిణి, చలపతిరావు, చిడతల అప్పారావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. హలం ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
నీతినిజాయితీలతోనే జీవితంలో పైకి ఎదగాలనుకునే రవి అనే ఓ యువకుడు.. ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అతని జీవితంలో సరోజ (లక్ష్మి), జయ (జయప్రద) ఎలాంటి పాత్రలు పోషించారు? అనేదే `ఈతరం మనిషి` సినిమా. చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలకు ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర సాహిత్యమందించారు. పాటల్లో ``ఇచ్చేసా నా హృదయం తీసుకో``, ``ఓ కోమలి నా జాబిలి``, ``నవనవలాడే``, ``రావయ్యా ఓ తెలుగు బావా`` రంజింపజేశాయి. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్. వెంకటరత్నం, కె. రవీంద్రనాథ్ సంయుక్తంగా నిర్మించిన `ఈతరం మనిషి`.. 1977 ఫిబ్రవరి 10న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |