![]() |
![]() |

పాపులర్ తమిళ యాక్టర్-డైరెక్టర్ ఆర్.ఎన్.ఆర్. మనోహర్ బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతూ గడచిన 20 రోజులుగా ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మనోహర్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తమిళ అగ్ర దర్శకుల్లో ఒకరైన కె.ఎస్. రవికుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ద్వారా మనోహర్ తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఆ తర్వాత పలు చిత్రాలకు ఆయన స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. వాటిలో మైందాన్, కోలంగళ్, పుదుమై పితన్, తెన్నెవాన్, పున్నగల్ పూవే లాంటి చిత్రాలున్నాయి. 2009లో 'మాసిలమణి' అనే కామెడీ మూవీతో ఆయన డైరెక్టర్‌గా మారారు. నంద, పూర్ణ జంటగా నటించిన 'వెల్లూర్ మావట్టమ్' (2011) అనే పోలీస్ డ్రామాను ఆయన రూపొందించారు.
ఇక నటునిగా పలు సినిమాల్లో ఆయన నటించారు. కోలంగళ్, దిల్, వీరమ్, యెన్నై అరిందాల్, వేదాళమ్, నానుమ్ రౌడీ దాన్, విశ్వాసమ్, కాప్పన్, ఖైదీ లాంటివి వాటిలో కొన్ని. శక్తి సౌందరరాజన్ డైరెక్ట్ చేసిన 'టెడ్డీ' మూవీలో చివరిసారిగా ఆయన కనిపించారు. విశాల్ హీరోగా నటిస్తోన్న 'వీరమే వాగై సూడుమ్' సినిమాలోనూ ఆయన నటించారు. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. మనోహర్ మృతికి పలువురు తమిళ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేశారు.
![]() |
![]() |