![]() |
![]() |

'జై భీమ్' చిత్రంలో తమిళనాడు హైకోర్టు లాయర్ చంద్రుగా నటించడమే కాకుండా, ఆ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు స్టార్ యాక్టర్ సూర్య. 1990ల కాలంలో లాకప్ డెత్‌కు గురైన రాజాకన్ను అనే యువకుడి తరపున అతడి భార్య పార్వతి జరిపిన న్యాయపోరాటం ప్రధానాంశంగా రూపొందిన 'జై భీమ్' మూవీకి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు పార్వతి పేరిట రూ. 10 లక్షలను డిపాజిట్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడు.
చెన్నై సమీపంలో దినసరి కూలీగా పనిచేస్తూ పొట్టగడుపుకుంటున్న పార్వతికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా సూర్యను సీపీఐ(ఎం) తమిళనాడు సెక్రటరీ కె. బాలకృష్ణన్ కోరారు. దీనికి స్పందించిన సూర్య ఆదివారం ఓ ప్రకటన చేస్తూ, పార్వతి పేరిటి రూ. 10 లక్షలను ఓ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాననీ, ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని పార్వతి వాడుకోవచ్చునని తెలిపాడు. "ఆమె తర్వాత, ఆమె చట్టబద్ధ వారసులు ఆ డబ్బును వాడుకోవచ్చు" అని సూర్య చెప్పాడు.
రాజాకన్ను అనే ఒక అమాయకుడిపై దొంగతనం నేరం మోపి, కస్టడీలో చిత్రహింసలు పెట్టి, అతడు చనిపోతే, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఒకదాని తర్వాత ఒకటిగా నేరాలు చేసుకుంటూ వెళ్లిన పోలీసులకు వ్యతిరేకంగా కోర్టులో వాదించి, రాజాకన్ను భార్యకు లాయర్ చంద్రు ఎలా న్యాయం జరిగేలా చూశాడో 'జై భీమ్' మూవీ కళ్లకు కట్టినట్లు రియలిస్టిగ్గా చూపించింది. యథార్థ ఘటన ఆధారంగా టి.జె. జ్ఞానవేల్ ఈ సినిమాని రూపొందించాడు.
![]() |
![]() |