![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జై భీమ్'. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడులై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమ వర్గాన్ని అవమానించారంటూ కొందరు మూవీ టీమ్ పై బెదిరింపులకు దిగుతున్నారు. హీరో సూర్యని కొట్టినవారికి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తామని తాజాగా ఓ రాజకీయ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.
జై భీమ్ సినిమాలో వన్నియార్ కమ్యూనిటీని అవమానించారంటూ పీఎంకే నేతలు విరుచుకుపడుతున్నారు. కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తున్న జై భీమ్ నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే నేత పన్నీర్ సెల్వం నేతృత్వంలోని బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు వన్నియార్ కమ్యూనిటీని అవమానించిన నటుడు సూర్యపై దాడి చేసిన వారికి పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని పీఎంకే నేత సంచలన ప్రకటన చేశాడు. మరోవైపు, రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది.
మరో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి కూడా ఇటీవల ఇలాంటి పరిణామమే ఎదురైంది. ఆయనపై బెంగళూర్ ఎయిర్ పోర్ట్ లో ఓ యువకుడు దాడి చేశాడు. తేవర్ అయ్యను అవమానించిన కారణంగానే ఆ యువకుడు విజయ్ పై దాడి చేశాడని హిందూ మక్కల్ కచ్చి ఫౌండర్ అర్జున్ సంపత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు విజయ్ ని కొట్టినవారికి ఒక్కో దెబ్బకి వెయ్యి రూపాయలు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు.
కోలీవుడ్ స్టార్స్ ని కొట్టిన వారికి ప్రైజ్ మనీ ఇస్తామని రాజకీయ నాయకులు ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే వారు తమ రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చగొట్టి హీరోలపై దాడికి ఉసిగొల్పుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జై భీమ్ వివాదంలో సినీ ప్రముఖులు, సినీ ప్రేమికులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
![]() |
![]() |