![]() |
![]() |

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగింది. కళారంగానికి సంబంధించి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఆయన తరపున తనయుడు ఎస్పీ చరణ్ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
"భారతీయ సినిమాలో, ప్రత్యేకించి దక్షిణ భారత మూవీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి కోవింద్ బహూకరించారు. ఆయన పలు భాషల్లో అగ్రశ్రేణి ప్లేబ్యాక్ సింగర్" అని రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది.
అలాగే ప్రముఖ గాయని చిత్ర రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. సినీ రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డును స్వీకరించిన వారిలో నటి కంగనా రనౌత్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, గాయకుడు అద్నాన్ సమీ ఉన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.

![]() |
![]() |