![]() |
![]() |

28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'జై భీమ్'. కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా చూసి సినీ ప్రముఖులు సైతం చలించిపోతున్నారు. తాజాగా రాఘవ లారెన్స్ స్పందిస్తూ రాజాకన్ను సతీమణి పార్వతికి ఇల్లు కట్టిస్తానని తెలిపారు.
సేవా కార్యక్రమాల్లో ముందుండే లారెన్స్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. 'జై భీమ్' చూసి చలించిపోయిన ఆయన.. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. సరైన ఇల్లు కూడా లేక కడు పేదరికాన్ని అనుభవిస్తోన్న రాజాకన్ను భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని ప్రకటించారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆమెకు తప్పకుండా తన సొంత డబ్బుతో మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ హామీ ఇచ్చారు. అలాగే 28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జై భీమ్ చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 2 న విడుదలైంది.
![]() |
![]() |