![]() |
![]() |

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. ఆయన నటించగా ఇదివరకు వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ఇది ప్రీక్వెల్. ఒరిజినల్‌లో బంగార్రాజుగా నాగార్జున ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించారు. ఇప్పుడు ఆ పాత్రతో మరోసారి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నారు. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు'ను కూడా రూపొందిస్తున్నారు. నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా "లడ్డుండ" అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
మంగళవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సాంగ్‌ను నాగార్జున షేర్ చేశారు. దానికి, "Good morning my friends!! Time to play LADDUNDA " అనే క్యాప్షన్ జోడించారు. అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటను ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ ఆలపించగా, పాట ఆరంభంలో వచ్చే "అబ్బాయ్ హార్మొనీ.. డంటకు డడనా" అనే సాకీతో పాటు మధ్య మధ్యలో వచ్చే 'లడ్డుండ' అనే మాటను నాగార్జున స్వయంగా ఆలపించడం విశేషం.
ఆద్యంతం హుషారుగా సాగే ఈ పాట మ్యూజికల్ లవర్స్‌ను బాగా అలరించేట్లు ఉంది. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ ఇచ్చిన ట్యూన్స్ ఎనర్జిటిగ్గా, డాన్సులు చేయించే విధంగా ఉంది. ఈ సాంగ్‌ను నాగార్జున, ముగ్గురు అందమైన అమ్మాయిలు, డాన్సర్ల మీద చిత్రీకరించారు. ఆ అమ్మాయిల్లో వేదిక ఒకరు.
కాగా ఈ పాటను తన ట్వట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నాగచైతన్య, "Nana no one can match your swag !" అనే క్యాప్షన్ పెట్టారు.

'బంగార్రాజు'లో నాగ్ జోడీగా మరోసారి రమ్యకృష్ణ అలరించనుండగా, చైతూ సరసన కృతి శెట్టి నటిస్తోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 15న విడుదల కానున్నది.
![]() |
![]() |