![]() |
![]() |

మాధురీ దీక్షిత్ కొడుకు ర్యాన్ రెండేళ్ల పాటు జుట్టును పెంచి, ఎట్టకేలకు దాన్ని కత్తిరించి, కేన్సర్ పేషెంట్లకు డొనేట్ చేశాడు. నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా 'కేన్సర్ సొసైటీ'కి తన జుట్టును ర్యాన్ విరాళంగా ఇచ్చాడు. కొడుకు చేసిన పనికి గర్వంతో పొంగిపోయిన మాధురి అతను తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంటున్న దృశ్యాన్ని వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. కేన్సర్‌తో బాధపడుతున్న వాళ్లకు తనేం చేయలేకపోతున్నానని బాధపడ్డ ర్యాన్, తన వంతుగా కేన్సర్‌తో బాధపడుతున్న వారి కోసం ఏదైనా చెయ్యాలని తపించాడని ఆమె తెలిపింది.
"నేషనల్ కేన్సర్ డే సందర్భంగా, నిజంగా ఒక స్పెషల్ న్యూస్‌ను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. కేన్సర్ కోసం కీమో చేయించుకుంటున్న పలువురిని చూసి ర్యాన్ చాలా వేదనపడ్డాడు. కీమో సందర్భంగా వారు తమ జుట్టును కోల్పోతారు. కేన్సర్ సొసైటీకి తన జుట్టును విరాళంగా ఇవ్వాలని అతను నిర్ణయించుకున్నాడు. అతని డెసిషన్‌కు పేరెంట్స్‌గా మేం థ్రిల్లయ్యాం. నిబంధనల ప్రకారం, నిర్దేశిత పొడవుకు జుట్టు పెరగడానికి దాదాపు రెండేళ్ల పట్టింది. ఇప్పుడు పైనల్ స్టెప్ వేశాడు. ఇవాళ మేం అతడిని చూసి గర్విస్తున్నాం" అని రాసుకొచ్చింది మాధురి.
ఆమె షేర్ చేసిన వీడియో చూసి, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సున్నితమైన స్టెప్ తీసుకున్న ర్యాన్‌ను శిల్పాశెట్టి, ఫరా ఖాన్ లాంటి సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. "చాలా అందమైన ఆలోచన, అతడిని ఆశీర్వదించండి" అని శిల్ప కామెంట్ పెట్టగా, "ఎంత సున్నితమైన, దయార్ద్రమైన ఆలోచన" అని ఫరా ఖాన్ రాసింది.
![]() |
![]() |