![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తోన్న 'భీమ్లా నాయక్' పాటలు యూట్యూబ్‌లో అదరగొడుతున్నాయి. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటలు సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నట్లు వాటికి వస్తున్న వ్యూస్ తెలియజేస్తున్నాయి. ఫస్ట్ సింగిల్ తొలి 24 గంటల్లో 8.28 మిలియన్ వ్యూస్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. నెల రోజుల క్రితం రిలీజ్ చేసిన ఆ సాంగ్‌కు ఇంతదాకా 13.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన అంత ఇష్టం పాటకు 7.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇక నిన్న విడుదల చేసిన 'లాలా భీమ్లా' సాంగ్ మరింతగా మ్యూజిక్ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఎంతగా అంటే.. రిలీజ్ చేసిన 24 గంటల్లో వ్యూస్ పరంగా పాత రికార్డులను బద్దలుకొట్టే స్థాయిలో! అవును. రిలీజ్ చేసిన 24 గంటల్లో 'లాలా భీమ్లా' లిరికల్ సాంగ్ 11.3 మిలియన్ వ్యూస్‌ను సాధించి, 'పుష్ప'లోని 'సామి సామి' సాంగ్ సృష్టించిన 9.06 మిలియన్ వ్యూస్ రికార్డును తిరగరాసింది. అంతేకాదు, సౌత్ ఇండియాలోనే ఇది రికార్డ్ అని నిర్మాతలు తెలిపారు.
నిజానికి 'లాలా భీమ్లా' అనేది పాట తరహాలో కాకుండా వచనం తరహాలో కొనసాగిన పాట కావడం ఇక్కడ గమనార్హం. భీమ్లా నాయక్ ఎలాంటివాడో చెప్పే ఈ పాటను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాయడం మరో విశేషం. అరుణ్ కౌండిన్య పాడిన తీరు ఈ పాటకు ఆకర్షణను తీసుకొచ్చింది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న 'భీమ్లా నాయక్'లో రానా, నిత్యా మీనన్, మురళీశర్మ కీలక పాత్రధారులు. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లాన్ చేస్తోంది.
![]() |
![]() |