![]() |
![]() |

రజనీకాంత్ టైటిల్ రోల్ చేసిన 'పెద్దన్న' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్లు ట్రేడ్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా రజనీకాంత్ సినిమాకు టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకు ఉండే క్రేజ్ ఉంటుంది. కానీ పెద్దన్న విడుదలకు ఆ తరహా క్రేజ్ ఏమాత్రం కనిపించలేదు. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్ 4న విడుదలైన ఈ సినిమాకు క్రేజ్ అటుంచి, బ్యాడ్ టాక్ రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
రోజు రోజుకూ కలెక్షన్లు డ్రాప్ అవుతూ రావడంతో 'పెద్దన్న' డిజాస్టర్ దిశగా వెళ్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో వసూళ్లు దారుణంగా ఉండటంతో బయ్యర్లు భారీగా నష్టాలు చవిచూడటం ఖాయమైంది. సెలవురోజైన ఆదివారం సైతం 'పెద్దన్న' ఆడుతున్న థియేటర్లు చాలావరకు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 12.5 కోట్లకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన 'పెద్దన్న'కు నాలుగు రోజుల్లో వచ్చిన షేర్ కేవలం రూ. 3.16 కోట్లు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే 25 శాతమే రికవర్ అయ్యిందన్న మాట. దీంతో బయ్యర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.
శివ డైరెక్ట్ చేసిన 'పెద్దన్న' మూవీలో రజనీ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించగా, నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషించారు. పెద్దన్న కలెక్షన్లు ఘోరంగా ఉండగా, దాని తమిళ ఒరిజినల్ వెర్షన్ 'అణ్ణాత్త' మాత్రం తమిళనాడు వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం.
![]() |
![]() |